నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తా – స్పీకర్
చింతకాయల అయ్యన్నపాత్రుడు
నర్సీంపట్నం – ఏపీ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల్లో ఎల్లవరం గ్రామానికి రూ. 2.81 కోట్లు నిధులు మంజూరు చేశామని తెలిపారు, ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు.
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం నియోజకవర్గ పరిధిలోని గొలుగొండ మండలం ఎల్లవరంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చింతకాయల అయ్యన్న పాత్రుడు వివరించారు.
దీపావళి నుంచి ఉచితంగా మూడు సిలిండర్లు పంపిణీ చేయనున్నాట్లు ప్రకటించారు . గత ప్రభుత్వం హయాంలో పంచాయతీకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎల్లవరం పంచాయతీకి రూ. 7 లక్షలు మంజూరు చేశారని అన్నారు.
“ఎల్లవరం గ్రామం నాకు మెజారిటీ ఇచ్చింది, వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాదే,” అని అయ్యన్నపాత్రుడు అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కొంత సమయం పడుతుందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకెళ్లి ఖజానా ఖాళీగా అప్పజెప్పిందని ఆయన ఆరోపించారు.
“16,437 ఉద్యోగాల కోసం మెగా DSC ప్రకటించాం. పెన్షన్లు పెంచి, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్క రోజులోనే పంపిణీ చేస్తున్నాము . నర్సీపట్నం ఆస్పత్రులకు వచ్చే రోగులకు తక్కువ ధరలో భోజనం అందించేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాం అని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నాం అన్నారు . ఉద్యోగస్తులకు ప్రతి నెలా మొదటి తేదీనే జీతాలు వేస్తున్నాం,” అని అయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో జై రామ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అడిగిర్ల నాని బాబు, కే ఎల్లవరం సర్పంచ్ రాంబాబు, నియోజకవర్గం ఇంచార్జ్ సూర్యచంద్ర, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.