అమృత్ టెండర్లలో రూ. 8,888 కోట్ల స్కామ్
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అమృత్ టెండర్లలో రూ. 8,888 కోట్ల కుంభకోణం జరిగిందని ఆధారాలతో సహా బయట పెట్టారు. దీనిపై కేంద్రం వెంటనే విచారణకు ఆదేశించాలని కోరారు.
శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన భారీ కుంభకోణాన్ని బయట పెట్టారు. రూ. 8,888 కోట్ల రూపాయల భారీ అవినీతికి రేవంత్ రెడ్డి తెర లేపారంటూ ఆరోపించాచరు కేటీఆర్.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సీఎం భారీ స్కామ్ కు పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి ఎలాంటి అర్హత లేక పోయినా వేల కోట్ల రూపాయల పనులు అప్పగించారని ధ్వజమెత్తారు. దీనిపై సీఎం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు .
ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని బెదిరించారని, సదరు కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు కేటీఆర్. సదరు కంపెనీతో సీఎం బామ్మర్తి కంపెనీతో జాయింట్ వెంచర్ కలిగి ఉన్నట్లు డ్రామాకు తెర లేపారంటూ ఫైర్ అయ్యారు.
ఈ కంపెనీని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బావమరిది సూదిని సృజన్ రెడ్డి ప్రజా ధనాన్ని అడ్డగోలుగా కొల్ల గొడుతున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని, తన బావమరిదికి మేలు చేసేలా కాంట్రాక్టు అప్పగించారని ఆరోపించారు కేటీఆర్.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం 7, 11, 13 నిబంధనల మేరకు రేవంత్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ చట్టాల కారణంగానే సోనియా గాంధీ తన పదవిని కోల్పోయారని గుర్తు చేశారు.
అంతే కాకుండా కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కూడా అక్రమ మైనింగ్ అనుమతులు తన కుటుంబ సభ్యులకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారని చెప్పారు కేటీఆర్. అప్పటి ఆదర్శ స్కామ్ లో 2011లో చవాన్ తన పదవిని కోల్పోయారని గుర్తు చేశారు.
ఒకవేళ టెండర్ సక్రమంగా ఉంటే ఎందుకు వివరాలు బయట పెట్టడం లేదంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి .