NEWSTELANGANA

ట్రిపుల్ ఆర్ పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

సీఎం స్వంత వ్య‌వ‌హారంగా మార్చేశారని ఫైర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సీఎం స్వంత వ్య‌వ‌హారంగా ట్రిపుల్ ఆర్ మారింద‌ని ఆరోపించారు. ఇది పూర్తిగా రూల్స్ కు విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు కేటీఆర్. దీనిపై వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించాల‌ని ఆయ‌న కోరారు.

ఎందుకు గోప్యంగా ద‌క్షిణ భాగం అలైన్ మెంట్ ను రూపొందించారంటూ కేటీఆర్ ప్ర‌శ్నించారు. దీనిపై రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.
ప్ర‌ధానంగా ట్రిపుల్‌ ఆర్‌ దక్షిణ భాగం డిజైన్ల తయారీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఆది నుంచి సందేహాలకు, అనుమానాల‌కు తావిస్తోంద‌ని అన్నారు కేటీఆర్.

ట్రిపుల్ ఆర్ రూపకల్పన ముఖ్యమంత్రితోపాటు ఆయన ఎంపిక చేసుకున్న కొద్ది మంది సలహాదారులు, కన్సల్టెంట్ల మధ్య, ఓ క్లోజ్డ్‌ రూమ్‌లో జరగడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి.

ప్రజా ప్రయోజనాల కోసమే చేపడుతున్నట్లు చెబుతున్న ఈ ప్రాజెక్టులో సంబంధిత విభాగం అధికారులకే చోటు కల్పించక పోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలను రేకెత్తిస్తున్నదని అన్నారు. ఇది ముఖ్యమంత్రి సొంత వ్యవహారంలా మారి పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయ‌ని తెలిపారు.

రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్మాణానికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించే ఆర్‌అండ్‌బీ శాఖను ట్రిపుల్‌ ఆర్‌ డిజైన్ల తయారీలో ప్రభుత్వం పూర్తిగా దూరం పెట్టడం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్.