లోకేష్..రోజుకో మాట మాట్లాడితే ఎలా..?
నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ
అమరావతి – తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది వైఎస్సార్సీపీ. ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఏపీ ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదంటూ ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఇదేమి రాజకీయం అంటూ ప్రశ్నించింది.
నిన్న ఒక మాట ఇవాళ మరో మాట మాట్లాడుతూ జనాలను కన్ ఫ్యూజ్ చేయడం తప్పితే ఏపీకి నువ్వు, మీ నాయన చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేసింది వైఎస్సార్సీపీ. టీటీడీ స్వతంత్ర సంస్థ అని, దానితో తమకు సంబంధం లేదని చెప్పడం సమస్యను పక్కదారి పట్టించడమేనని పేర్కొంది.
టీటీడీలో నియామకాలు తప్పా సీఎం పాత్ర ఏమీ ఉండదని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపింది. ఇదే సమయంలో తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ ఈవో జె. శ్యామల రావు చేసిన వ్యాఖ్యలు మరో రకంగా ఉన్నాయని, సీఎం చేసిన ఆరోపణలకు ఈవో చెప్పిన దానికి పొంతన లేకుండా పోయిందని తెలిపింది.
విచిత్రం ఏమిటంటే దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాక ఈవో స్పందించడం, ఆ ట్యాంకర్లకు సంబంధించి నెయ్యిని వాడడం లేదని చెప్పడం చూస్తే ఇక లడ్డూలో కల్తీ ఎక్కడ జరిగిందో చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్ నాయుడు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. పాలనా పరంగా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికింది.