టీటీడీ అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
డిమాండ్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నంబూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదం తనను కలిచి వేసిందన్నారు.
గత వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టీటీడీలో చెప్పలేని రీతిలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు పవన్ కళ్యాణ్. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి జరిగిన అక్రమాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలపై విచారణ జరగాల్సి ఉందన్నారు డిప్యూటీ సీఎం. వైసీపీ పాలనలో 219 గుడులను, విగ్రహాలను ధ్వంసం చేసి అపవిత్రం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
NADB CALF ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ లో శ్రీవారి ఆలయంలో లడ్డూ మహా ప్రసాదం వినియోగించిన నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు, చేప నూనె, ఇతర నూనెలు వాడినట్లు తెలిసిందని, ఇది చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల.
వైసీపీ హయంలో టీటీడి బోర్డు స్వామి వారి సేవలను మార్చేశారని, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక్కొక్కరి దగ్గర 10 వేలు వసూరు చేశారని, కానీ బిల్లు మాత్రం 500 మాత్రమే ఇచ్చారని, దీనిపై గతంలో ఎన్నోసార్లు మాట్లాడానని, కానీ ఏనాడూ చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు డిప్యూటీ సీఎం.