శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే ముందంజ
దేశంలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సర్కార్
శ్రీలంక – ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న శ్రీలంక దేశ అధ్యక్ష ఎన్నికల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్క్సిస్ట్ భావ జాలం కలిగిన అనురా దిస నాయకే ప్రస్తుతం ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా దేశ వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కర్ఫ్యూ పొడిగించినట్లు ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం.
ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కడపటి వార్తలు అందేసరికి అనుర దిస నాయకే ప్రస్తుత ప్రెసిడెంట్ కంటే ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. ఇక దిస నాయకేకు లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా కర్ఫ్యూ పొడిగించిన విషయాన్ని ప్రజా భద్రత మంత్రి తిరాన్ అల్లెస్ వెల్లడించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
శ్రీలంకలో సంక్షోభం చోటు చేసుకున్న తర్వాత జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్నారు అనుర దిస నాయకే. కాగా శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది.
ట్రెండ్స్ ప్రకారం దిస నాయకేకు 49.8 శాతం ఓట్లు రాగా సమగి జన బలవేగయ నాయకుడు సజిత్ ప్రేమ దాసకు 25.8 శాతం ఓట్లు వచ్చాయి. వీరితో పాటు యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేకు 16.4 శాతం ఓట్లు మాత్రమే సంపాదించారు.