ఇదేమి రాజ్యం ఇదేమి అన్యాయం..?
బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అనుగుల రాకేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఏదో ఒక రోజు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు బుద్ది చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు అనుగుల రాకేశ్ రెడ్డి.
హైడ్రా పేదలకు ఒక రీతిన పెద్దలకు మరో రీతిన వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసు ఇచ్చి వదిలి వేసిందని, కానీ కూకట్ పల్లిలో ఇవాళ పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉంటున్న వారికి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ప్రశ్నించారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా వ్యవహరిస్తే వ్యవస్థలు ఊరుకోవని హెచ్చరించారు అనుగుల రాకేశ్ రెడ్డి. కోర్టుకు పోకుండా వారాంతాల్లో వాళ్లను ఇళ్లు కూల్చే అధికారం హైడ్రాకు, కమిషనర్ కు, సీఎం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారంటూ నిలదీశారు.
ముఖ్యమంత్రి సోదరునికి ఓ న్యాయం సామాన్యులకు ఓ న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనుగుల రాకేశ్ రెడ్డి. వెంటనే కూల్చి వేతలను ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేయడం పద్దతి కాదని పేర్కొన్నారు.