సింహాచలం లడ్డూ నాణ్యతలో తేడా
తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారులు
విశాఖపట్నం జిల్లా – తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ విషయం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రస్తుత తరుణంలో మరో వివాదం తెర పైకి వచ్చింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలకు సంబంధించి తయారు చేసే అన్ని ప్రసాదాలపై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ప్రముఖ పుణ్య క్షేత్రమైన విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో తయారు చేసే లడ్డూ ప్రసాదానికి సంబంధించి తనిఖీలు చేపట్టారు. ఆహార భద్రతా అధికారుల విచారణలో ఆసక్తికరమైన అంశం బయట పడింది.
తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించడంపై కలకలం రేగడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సింహాచలం ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని తనిఖీ చేశారు.
నాణ్యతలో దారుణంగా తేడా ఉండటం గమనించి, సీజ్ చేశారు. గతంలో రూ.591 కి కేజీ నెయ్యి కొంటే, తరువాత జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో సగానికి సగం తగ్గించి, రూ.341 కి నెయ్యి తెప్పించారు. సీజ్ చేసిన నెయ్యిని అధికారులు టెస్టింగ్ కి పంపించారు.