శ్రీలంక అధ్యక్షుడిగా కూలీ కొడుకు
మార్క్సిస్ట్ భావజాలం కలిగిన నేత
శ్రీలంక – శ్రీలంక దేశ అధ్యక్షుడిగా 56 ఏళ్ల వయసు కలిగిన అనుర కుమార దిస నాయకే ఎన్నికయ్యారు. భారీ తేడాతో విజయం సాధించారు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చి అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. తండ్రి కూలీ, తల్లి గృహిణి. ఓ సోదరి ఉన్నారు. పేదలు, సామాన్యుల పట్ల అత్యంత ప్రేమను కలిగిన అరుదైన ప్రజా నాయకుడు అనుర కుమార దిసనాయకే. ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో పాటు సవాలక్ష సమస్యలతో అట్టుడుకుతోంది.
ఈ తరుణంలో దిసనాయకే ముందు పెను సవాళ్లు ఉన్నాయి. శ్రీలంక ప్రజలు గంప గుత్తగా దిసనాయకే వైపు మొగ్గు చూపారు. ఆయన వామపక్ష భావజాలం కలిగిన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. శ్రీలంక దేశం రెండు సంవత్సరాల కాలంలో కుడి నుండి ఎడమ వైపునకు పాలన మారింది. రాజపక్సే, విక్రమ సింఘే, రణిలే ప్రేమదాస్ లను కాదని అనుర కుమార దిసనాయకేకు కట్ట బెట్టారు శ్రీలంక ప్రజలు. ఇది చరిత్రాత్మకమైన తీర్పు అని చెప్పక తప్పదు.
ఇదిలా ఉండగా దిసనాయకెపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ విజయం తన ఒక్కడిది కాదని శ్రీలంక దేశానికి చెందిన ప్రజలందరిదీ అని స్పష్టం చేశారు నూతన అధ్యక్షుడు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో 38 మంది పోటీ చేశారు. 42 శాతానికి పైగా ఓట్లను సాధించి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు అనుర కుమార దిస నాయకే.