DEVOTIONAL

తిరుమ‌ల ఆల‌యంలో శాంతి యాగం

Share it with your family & friends

పాల్గొన్న ఈవో శ్యామ‌ల రావు, అద‌న‌పు ఈవో

తిరుమ‌ల – శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల వరకు తితిదే శాంతి హోమం నిర్వహించింది. శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలగటంతో, దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం చేశారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేశారు.

ఈ సంద‌ర్బంగా ఈవో జె. శ్యామ‌ల రావు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింప జేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి యాగం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా శ్రీవారి నైవేద్యంలో వాడే నెయ్యిలో కల్తీ ఉందని గుర్తించడం జ‌రిగింద‌న్నారు.

⁠⁠సర్వపాప పరిహారార్థం, భక్తుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సోమ‌వారం ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో శాంతి హోమం చేప‌ట్టామ‌ని తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు.

ఇదివరకే ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు టీటీడీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించిందని, అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు ఉన్నది గుర్తించినందున, అందుకు పరిహరణగా శాంతి హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి సూచించింద‌న్నారు.

•⁠లడ్డూల రుచిని మెరుగు పరిచేందుకు టీటీడీ చేపట్టిన చర్యలను వివరించారు. టీటీడీ ప్రస్తుతం ఆవు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చి వేసిందని, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఎంతో పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

ఈ సంస్కరణలతో ఇప్పుడు లడ్డూ ప్రసాదం రుచి అనేక రెట్లు మెరుగు పడిందని, భక్తులు కూడా ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఈవో వివరించారు.

ఈ సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, శ్రీ రామకృష్ణ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.