ఈ విజయం 30 ఏళ్ల పోరాట ఫలితం – అనుర
1994 నుండి ఉద్యమిస్తూనే వచ్చాం
శ్రీలంక – శ్రీలంక దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిస నాయకే కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా శ్రీలంక దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అనుర కుమార దిస నాయకే.
ఈ స్థాయికి, అత్యున్నతమైన అధ్యక్షుడి పదవిని చేరుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెప్పారు. ఇవాళ తనకు సంబంధించిన విజయం కానే కాదని, ఇది శ్రీలంక దేశానికి చెందిన ప్రతి ఒక్కరికీ చెందిన గెలుపుగా తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు అనుర కుమార దిస నాయకే.
తమ పార్టీ గత 1994 సంవత్సరం నుంచి పోరాటం చేస్తూనే వస్తోందని అన్నారు . చివరకు 30 సంవత్సరాల తర్వాత తమ కల నెరవేరిందని, ఈరోజు కోసం కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారని, దానిని తలుచుకున్నప్పుడల్లా తనకు కళ్లల్లో నీళ్లు వస్తాయని అన్నారు అనుర కుమార దిస నాయకే.
ఈ దేశం అందరికీ చెందినది. గత కొంత కాలం నుంచీ జాతుల మధ్య పోరాటం కొనసాగింది. కానీ ఇక నుంచి ఎలాంటి విభేదాలంటూ ఉండవు. ప్రతి ఒక్కరికీ సమానమైన హక్కులు వర్తింప చేస్తామని ప్రకటించారు. పేదలు, సామాన్యులే తమ పార్టీ ప్రధాన అజెండాగా సాగుతుందన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం అన్నది లేకుండా పాలన సాగించడం తమ ముందున్న కర్తవ్యమని, ఆ దిశగా తాను అడుగులు వేస్తానని వెల్లడించారు అనుర కుమార దిసనాయకే.