NEWSTELANGANA

బీఆర్ఎస్ త్రిస‌భ్య క‌మిటీని అడ్డుకుంటే ఎలా..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియ‌స్ అయ్యారు. సోమ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం కావాల‌ని ప్ర‌తిపక్ష పార్టీని టార్గెట్ చేసింద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని అన్నారు. పాల‌న గాడి త‌ప్పింద‌ని, జ‌వాబుదారీత‌నం లోపించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవల విషయంలో అధ్యయనం చేసేందుకు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాల‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్.

ఇప్పటికే కమిటీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇండ్ల వద్దకు పోలీసులు చేరు కోవ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. ముగ్గురు నాయకులను అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని మండిప‌డ్డారు కేటీఆర్.

ఆసుపత్రుల సందర్శనకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటూ ప్ర‌శ్నించారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు నిపుణులైన డాక్టర్లుగా గాంధీ ఆసుపత్రికి వెళ్ల‌కుండా అడ్డుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు.