బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
గాంధీ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ – రాష్ట్రంలో వైద్య ఆరోగ్యం పడకేసిందని, ఆస్పత్రులలో వసతి సౌకర్యాలు కల్పించడం లేదని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, డాక్టర్ కె. సంజయ్ , మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ లను నియమించింది.
సోమవారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నం చేయబోయిన బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ సభ్యులను బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో గాంధీ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తాము ప్రజాస్వామ్యయుతంగా సందర్శిస్తున్నామని, దీనిని అడ్డుకునే హక్కు పోలీసులకు కానీ, ప్రభుత్వానికి లేదని ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాచరిక పాలన సాగిస్తున్నారంటూ ఆరోపించారు.
తాము ప్రజల కోసమే , వారి బాగు కోసమే కమిటీగా ఏర్పాటు అయ్యామని, ప్రభుత్వానికి కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. అయినా వినిపించు కోకుండా పోలీసులు ఎమ్మెల్యేలు డాక్టర్ కే సంజయ్, మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్లను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసిన వీరిని నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.