సీఎం సహాయ నిధికి మహేష్ బాబు విరాళం
రూ. 60 లక్షల చెక్కు అందించిన నటుడు
హైదరాబాద్ – ప్రముఖ నటుడు ప్రిన్స్ మహేష్ బాబు, తన సతీమణి నమ్రతతో కలిసి సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది. దీంతో తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు, వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి తమ వంతు బాధ్యతగా విరాళాలు అందజేశారు.
ఇవాళ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతతో కలిసి తన వంతుగా తెలంగాణ సర్కార్ కు రూ. 50 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. అంతే కాకుండా తనకు చెందిన ఏఎంబీ తరపున మరో రూ. 10 లక్షల విరాళాన్ని సీఎంకు ఇచ్చారు.
ఈ సందర్బంగా తమ వంతుగా తెలంగాణ వరద బాధితుల కోసం రూ. 60 లక్షలు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మహేష్ బాబుకు, ఆయన సతీమణి నమ్రతకు. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా రూ. 50 లక్షలు ఇచ్చారు. తన కొడుకు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షలు అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సైతం రూ. 50 లక్షలు ఇచ్చారు. ఆయన తరపున తన కూతురు సీఎంను కలిసి చెక్కును అందజేశారు.