చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి – చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. సోమవారం నిడదవోలులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నెల రోజుల్లో నిడదవోలులో మినీ స్టేడియం ప్రారంభిస్తామని ప్రకటించారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు కందుల దుర్గేష్. ప్రతిభ గలిగిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
క్రీడల్లో మారుమూల గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బాల్యం నుండే క్రీడాస్ఫూర్తి పెంపొందించు కోవాలని సూచించారు మంత్రి కందుల దుర్గేష్.
నిడదవోలు నియోజకవర్గం స్థాయి అండర్-14,17 బాల బాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. విద్యార్థులు చదువుపై ఫోకస్ పెట్టాలని, ఆటలలో కూడా రాణించాలని సూచించారు.
1954లో ప్రారంభించిన క్రీడాకారుల సెలక్షన్స్ కార్యక్రమం నేటికీ కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా మారుమూల గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు.
ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించు కోవాలని, ఆకాశమే హద్దుగా క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని సూచించారు. దేశ స్థాయి లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయని, ప్రతిభకు మరింత పదునుపెట్టాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు.