లడ్డూ కల్తీపై సుబ్రమణియన్ స్వామి దావా
సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు , ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యన్ స్వామి సంచలన ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించి నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ (పిల్) దాఖలు చేశారు. తిరుపతి ఆలయంలో తయారు చేసే లడ్డూలో స్వచ్చమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు, చేపల నూనె వాడారంటూ సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై టీటీడీ కీలకంగా మారిందని, ఈవోతో పాటు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు తాను దాఖలు చేసిన పిటిషన్ లో సీరియస్ కామెంట్స్ చేశారు సుబ్రమణ్యన్ స్వామి.
కోట్లాది మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన అంశమని, వారి మనోభావాలు దెబ్బ తినేలా ఇలా జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుబ్రమణ్యన్ స్వామి కోరారు.