బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అక్రమం
నిప్పులు చెరిగిన అనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అనుగుల రాకేశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు.
రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో రాచరిక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ అన్నది ఈ దేశంలోనే ఉందా అన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి డాక్టర్ రాజయ్య, డాక్టర్ కె. సంజయ్ , ఆనంద్ మెతుకు, నగర పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల మండిపడ్డారు అనుగుల రాకేశ్ రెడ్డి.
రాష్ట్రంలో ప్రజా సమస్యలను ఎత్తి చూపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, వైద్య, ఆరోగ్య రంగం పూర్తిగా పడకేసిందని , దీనిపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకే కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఎందుకంతగా సీఎం రేవంత్ రెడ్డి భయ పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వెంటనే బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలని అనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.