డ్రైవర్లు..కార్మికులను మినహాయించాలి
టీజీపీడబ్ల్యూయూ ఫౌండర్ , ప్రెసిడెంట్
హైదరాబాద్ – తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 4,20,000 మందికి పైగా డ్రైవర్లు, కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 77 లక్షలకు పైగా ఉన్నారని వెల్లడించారు. ప్రతి రోజూ లక్షలాది మంది క్యాబ్ డ్రైవర్లు, రైడర్స్ , కార్మికులు వెట్టి చాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షేక్ సలావుద్దీన్.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి దినసరి డ్రైవర్లు, కార్మికుల (డెలివరీ బాయ్స్ , గర్ల్స్ ) ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. గత కొంత కాలం నుంచి తాము న్యాయబద్దమైన డిమాండ్లను ఆయా రాష్ట్రాలతో పాటు కేంద్ర సర్కార్ ముందు ఉంచామని స్పష్టం చేశారు షేక్ సలావుద్దీన్.
ప్రధానంగా సామాజిక భద్రత లేకుండా పోయిందని వాపోయారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) మొబిలిటీ, రైడ్-హెయిల్ , వ్యక్తిగత సేవల మధ్య వర్తిత్వం వహించే ప్లాట్‌ఫారమ్‌లు, సేవలకు వస్తు సేవల పన్ను (GST) వర్తింప జేయడానికి సంబంధించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ అధికారిక లేఖను సమర్పించిందని తెలిపారు.
రాజస్థాన్ తో పాటు కర్ణాటక రాష్ట్రాలలో ఈ సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించామన్నారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రితో పాటు సెంట్రల్ బోర్డు డైరెక్ట్ టాక్సెస్ , కస్టమ్స్ చైర్మన్ , హైదరాబాద్ జీఎస్టీ , కస్టమ్స్ చీఫ్ కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని చెప్పారు షేక్ సలావుద్దీన్.
ప్రధానంగా గిల్ , ప్లాట్ ఫారమ్ కార్మికులకు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను వర్తింప చేయాలని, జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.