రెండుసార్లు లేఖ రాసినా పట్టించుకోని పీఎం
నిప్పులు చెరిగిన సీఎం మమతా బెనర్జీ
దుర్గాపూర్ – పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. తాను రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరుతూ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి రెండుసార్లు లేఖలు రాసినా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత సేపు బీజేపీ, మోడీ, అమిత్ షా, కాషాయ సంస్థలు పనిగట్టుకుని బీజేపీ యేతర రాష్ట్రాలను కావాలని టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మమతా బెనర్జీ.
దుర్గాపూర్ లో మీడియాతో మాట్లాడారు. పలుమార్లు సమస్యలు పరిష్కరించాలని కోరాను. తాను పీఎంను వ్యక్తిగతంగా కలిశానని తెలిపారు సీఎం. తనతో పాటు కాకుండా తమ ప్రతినిధి బృందం జలశక్తి మంత్రిత్వ శాఖకు, విద్యుత్ మంత్రిత్వ శాఖకు వెళ్లి వినతిపత్రాలు కూడా సమర్పించడం జరిగిందన్నారు మమతా బెనర్జీ.
పశ్చిమ బెంగాల్ మునిగి పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో రాజకీయ పోరాటాలు చేస్తారు కానీ తమకు రావాల్సిన నిధులను ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ సీఎం.
ఫసల్ బీమా యోజన కింద రైతులకు పూర్తి స్థాయిలో నిధులు అందజేస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదన్నారు మమతా బెనర్జీ.