DEVOTIONAL

ఆప్ ను కాపాడిన ఆంజ‌నేయుడు – సీఎం

Share it with your family & friends

హ‌నుమాన్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నఅతిషి

ఢిల్లీ – ఢిల్లీ రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు అతిషి సింగ్ మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె సీఎంగా కొలువు తీరినందుకు గాను దేశ రాజ‌ధానిలోని క‌న్నాట్ ప్రాంతంలో ఉన్న ప్ర‌ముఖ ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్బంగా ఆమె పూజ‌లు చేశారు. పూజారులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. స్వామి వారిని మొక్కిన అనంత‌రం సీఎం అతిషి సింగ్ మీడియాతో మాట్లాడారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌ల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ న‌డ్డా త్ర‌యం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని, ప్ర‌భుత్వాన్ని లేకుండా చేయాల‌ని కుట్ర‌లు ప‌న్నార‌ని ఆరోపించారు. కానీ వారి ఆటలు సాగ‌లేద‌ని, కుట్ర‌లు వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు సీఎం అతిషి సింగ్.

మాకంద‌రికీ ఎవ‌రైనా ట్ర‌బుల్ షూట‌ర్ ఉన్నారంటే ఒక్క హ‌నుమాన్ అని పేర్కొన్నారు. అందుకే ద‌ర్శించు కోవ‌డం జ‌రిగింద‌న్నారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా దాడులు జ‌రిగాయి. విఛిన్నం చేసేందుకు నానా ప్ర‌య‌త్నాలు కొన‌సాగాయిని అన్నారు అతిషి సింగ్.

కానీ హ‌నుమాన్ త‌మ నాయ‌కుడు అర‌వింద్ కేజ్రీవాల్ ను, ఆమ్ ఆద్మీ పార్టీని కాపాడారంటూ చెప్పారు సీఎం. ఆయ‌న ఆశీస్సుల‌తో ఢిల్లీ కోసం మ‌రింత ప‌ని చేసే శ‌క్తి సామ‌ర్థ్యాలు ఇవ్వాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అర‌వింద్ కేజ్రీవాల్ తిరిగి సీఎం కావాల‌ని ప్రార్థించిన‌ట్లు తెలిపారు అతిషి సింగ్.