అవినీతికి పాల్పడితే చని పోయినట్టే – సీఎం
భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ – పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు తీసుకు వచ్చానని చెప్పారు. ఆయన జాతీయ ఛానల్ తో జరిగిన చర్చా కార్యక్రమంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఎన్నికల సందర్బంగా చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేశానని అన్నారు భగవంత్ మాన్. అంతే కాకుండా అవినీతి రహిత పంజాబ్ ను తీర్చి దిద్దడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఒకవేళ తాను కానీ, తన కుటుంబానికి చెందిన వారు కానీ లేదా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు, అక్రమాలు చేసినట్లు నిరూపిస్తే తాను ఈ నిమిషమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు భగవంత్ మాన్.
ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేశామన్నారు. అంతే కాదు గత కొన్నేళ్లుగా చేస్తున్న కాంట్రాక్టు వారందరినీ పర్మినెంట్ ఉద్యోగులుగా నియామక పత్రాలు ఇచ్చానని తెలిపారు. అంతే కాదు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని అన్నారు.
తాము కేబినెట్ లో కొలువు తీరిన సమయంలో ఓ మంత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, వెంటనే పార్టీ నుంచి, కేబినెట్ నుంచి తొలగించానని, ఇలాంటి చర్య దేశంలో ఎక్కడా జరగలేదన్నారు భగవంత్ మాన్.