మత్తు పదార్థాలను అరికట్టండి
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
హైదరాబాద్ – రాష్ట్రంలో గుడుంబా, మత్తు పదార్థాలను అరికట్టాలని ఆదేశించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజ నరసింహ. తన క్యాంపు ఆఫీసులో ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రత్యేకించి సంగారెడ్డి జిల్లాలో గంజాయి, గుడుంబా నిర్మూలకు చర్యలు చేపట్టాలని సూచించారు.
గత ప్రభుత్వం వీటిని పెంచి పోషించిందని, దీని వల్ల నియంత్రణ అనేది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి చిన్నారుల నుంచి పెద్దల దాకా వీటి బారిన పడ్డారని వాపోయారు. గుడుంబా, గంజాయి లాంటి మత్తు పదార్థాలను రాష్ట్ర సర్కార్ నిషేధించడం జరిగిందని తెలిపారు.
గుడుంబా తయారీ, విక్రయాలు, గంజాయి రవాణా, అమ్మకాల పై గట్టి నిఘా పెట్టాలని, అందుకు బాధ్యులైన అక్రమార్కులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
జిల్లాలో గుడుంబా, గంజాయి నిర్మూలన పై ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయము చేసుకొని సంగారెడ్డి జిల్లాను గుడుంబా, గంజాయి రహిత జిల్లా గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు.