బీజేపీపై భగ్గుమన్న అవిముక్తేశ్వరానంద
గో సంరక్షణను వ్యతిరేకిస్తున్న కాషాయ పార్టీ
బీహార్ – ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన గత కొంత కాలం నుంచీ గో సంరక్షణపై మాట్లాడుతూ వస్తున్నారు.
ఆయన తన గౌ ధ్వజ్ యాత్రను ఉత్తర ప్రదేశ్ లోని ప్రముఖ క్షేత్రమైన అయోధ్య శ్రీరాముడి ఆలయం నుండి ప్రారంభించారు. ఈ యాత్ర ఇవాళ బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆయన తీవ్ర స్థాయిలో కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీపై మండిపడ్డారు.
ఈసారి ఎన్నికల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎవరైతే దేశ వ్యాప్తంగా గోవులను రక్షిస్తారో, వాటి సంరక్షణ కోసం పాటు పడతారో వారికే తమ విలువైన ఓటు వేయాలని పిలుపునిచ్చారు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద.
అంతే కాకుండా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం అంతటా ఏకీకృత గో సంరక్షణ చట్టం తీసుకు రావాలని కోరారు. ఇదిలా ఉండగా గో సంరక్షణను బీజేపీ వ్యతిరేకిస్తోందని విమర్శించారు.