తిరుపతి లడ్డూపై జాగ్రత్తగా మాట్లాడండి
హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విజయవాడ – ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సినిమా రంగానికి చెందిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి లడ్డూ కల్తీ ప్రసాదంపై ఆచి తూచి మాట్లాడాలని హితవు పలికారు. ఆయన పరోక్షంగా ప్రకాశ్ రాజ్, కార్తీ గురించి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎవరైనా సరే పద్దతిగా మాట్లాడాలని లేదంటే మౌనంగా కూర్చో వాలని సూచించారు పవన్ కళ్యాణ్. కనకదుర్గమ్మ మెట్లను శుభ్రం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినీ రంగానికి చెందిన వారు మీ మీ మాధ్యమాల ద్వారా తిరుమల గురించి చులకన చేసి మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.
ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు . స్వామి వారి లడ్డు మీద జోకులు వేస్తున్నారు, నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో కూడా చూశాను, లడ్డు సున్నితమైన సమస్య అని చెప్పి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.
మరో వైపు మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఆయన హిందువు లాగా మాట్లాడక పోవడం దారుణమన్నారు. ఇక మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భలే యాక్టింగ్ చేశారంటూ మండిపడ్డారు. ఆనాడు జగన్ నియమించిన బోర్డులో తప్పులు జరిగాయని ఆరోపించారు.
హిందువు అనే వాడికి ఈ దేశంలో భయం ఉండదన్నారు. అలాగే ఇతర మతాలపై ద్వేషం ఉండదని స్పష్టం చేశారు. మీరంతా బయటకు రావాలని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం తుది దాకా పోరాటం చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్.