శ్రీవారి భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయండి
ఈవోను ఆదేశించిన దేవాదాయ శాఖ మంత్రి
తిరుమల – తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు చక్కటి ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జె. శ్యామల రావును రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
తిరుమలలో దేవాదాయ శాఖ మంత్రి బస చేసిన అతిథి గృహంలో ఆయన శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టిటిడి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఈవో జె. శ్యామల రావు బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్ల గురించి మంత్రికి వివరించారు.
ఇందులో భద్రత విషయంలో తిరుమలలో చేపట్టిన భద్రత ఏర్పాట్లు, ముఖ్యంగా గరుడ సేవకు ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తామని తెలిపారు.
ఇంజనీరింగ్, వసతి, కళ్యాణ కట్ట, వైద్య, ఆరోగ్య, రవాణా, హిందూ ధర్మ ప్రచార పరిషత్ తదితర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలను మంత్రికి వివరించారు.
అదేవిధంగా గరుడ సేవనాడు చేపట్ట బోయే ఏర్పాట్లను కూడా వివరించారు. అనంతరం మంత్రి వర్యులకు ఈవో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సమావేశ అనంతరం మంత్రివర్యులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.