తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,616
తిరుమల – తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి నిత్యం కనీసం 70 వేలకు తగ్గకుండా భక్తులు స్వామి వారిని దర్శించుకునే వారు. కానీ రోజు రోజుకు భక్తుల రాక తగ్గుతోంది. వచ్చే నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భారీ ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ తరుణంలో ఈవో జె. శ్యామల రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తిరుమలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఇదే సమయంలో త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాలను అంగ రంగ వైభవోపేతంగా నిర్వహించాలని ఈవో జె. శ్యామల రావును ఆదేశించారు.
ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీవారి ప్రసాదం వివాదానికి దారి తీయడంతో ఆ ప్రభావం భక్తులపై పడినట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ 24న స్వామి, అమ్మ వార్లను కేవలం 67, 616 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషం. 22,759 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు.