ఢిల్లీ పీఠం ఆప్ కే అధికారం – సిసోడియా
మాజీ డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. జనం భారీ ఎత్తున ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆప్ ను లేకుండా చేయాలని కుట్ర పన్నిన వాళ్లకు ప్రజలు త్వరలోనే బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.
తనను 17 నెలల పాటు జైలులో ఉంచారని, కానీ ఏమీ చేయలేక పోయారని అన్నారు. ఎలాంటి ఆధారాలు చూపించలేక చేతులెత్తేశారని, చివరకు కోర్టు కూడా తప్పు పట్టిందని చెప్పారు మనీష్ సిసోడియా. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ చీఫ్, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డా కలిసి కుట్రలు పన్నినా వర్కవుట్ కాలేదన్నారు.
ఆప్ ప్రజల పార్టీ అని, సమస్యలను పరిష్కరించేందుకు మాత్రమే పని చేస్తుందని చెప్పారు. బీజేపీ దాని అనుబంధ సంస్థలు, నేతలు ఎన్ని కుట్రలు పన్నినా పని చేయవంటూ స్పష్టం చేశారు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. మరోసారి ఢిల్లీలో ఆప్ విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కొలువు తీరడం ఖాయమని స్పష్టం చేశారు.