తిరుపతి లడ్డూపై బాబు రాజకీయం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నాని
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై రాజకీయం చేయడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. నిన్నటి దాకా చిల్లర కామెంట్స్ చేస్తూ అడ్డంగా దొరికి పోయాడంటూ ఎద్దేవా చేశారు.
కోట్లాది మంది భక్తుల మనో భావాలకు భంగం కలిగించేలా నిరాధారమైన ఆరోపణలు చేయడం సీఎం స్థాయి వ్యక్తికి సరికాదన్నారు పేర్ని నాని. కేవలం కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ నాయకుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేసేందుకే ఇలాంటి ఆధారాలు లేని విమర్శలు చేశాడంటూ ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యకత్ం చేశారు మాజీ మంత్రి.
లడ్డూ ప్రసాదాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. తాము కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు కేవలం సిట్ తో దర్యాప్తు చేస్తామని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు పేర్ని నాని.
నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు చెప్పారని కానీ చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారంటూ మండిపడ్డారు. కూటమి నేతల పాపాల పరిహారం కోసం ఆలయాల్లో పూజలకు వైసీపీ పిలుపునిస్తోందని అన్నారు.