NEWSTELANGANA

తెలంగాణ‌ను రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దుతాం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంతి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంతో పోటీ ప‌డే విధంగా రాష్ట్రానికి చెందిన యువ‌తీ యువ‌కులు త‌యారు కావాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌ధానంగా రోజు రోజుకు మారుతున్న సాంకేతిక నైపుణ్యాన్ని అంది పుచ్చుకోవాల‌ని సూచించారు సీఎం.

“సాంకేతిక నైపుణ్యం అందించడానికి హైదరాబాద్ ఒక గమ్యస్థానంగా మారాలి. తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను ఒక విశ్వనగరంగా నిలబెట్టాలి” అని
స్ప‌ష్టం చేశారు.

గత పదేళ్లలో తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించ లేద‌న్నారు. ఆ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించినందునే యవత ప్రాధాన్యతగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.

బ్యాంకింగ్, ఫైన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగించారు .

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువకులు గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిస అవుతున్నార‌ని ఆవేద‌న చెందారు. కొందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సైతం డ్రగ్స్ సరఫరా చేస్తుండటం బాధాకరం అన్నారు. ఇది తెలంగాణకు ప్రమాదం. కఠినంగా అణిచి వేయాల్సిన అవసరం ఉందన్నారు ఎ. రేవంత్ రెడ్డి.

వ్యసనాలకు బానిస కాకుండా ఉండేందుకే వారిలో విశ్వాసం పెంపొందించడానికి ఐటీఐలను టాటా టెక్నాలజీస్‌తో కలిసి ఏటీసీలుగా తీర్చి దిద్దడం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు.

ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్న లక్షలాది విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండక పోవడానికి ప్రధానంగా టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాఫ్‌లో సరైన నిపుణులు లేక పోవడమేన‌ని అన్నారు సీఎం. యాజమాన్యాలు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగిస్తే ఆ కాలేజీల అనుమతులను రద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు రేవంత్ రెడ్డి.

ఐఎస్బీ, ఐఐటీ, నల్సార్, త్రిబుల్ ఐటీ, జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి నాణ్యమైన విద్యా సంస్థలు ఉన్నందునే బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయ‌ని, సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ ఒక హబ్‌గా మారాలని పిలుపునిచ్చారు సీఎం.

ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఎదిగిన అజయ్ బంగా, సత్య నాదెళ్ల, శంతను నారాయణ లాంటి పెద్ద కంపెనీలకు సీఈవోలు హైదరాబాద్‌లో చదువుకున్న వారేనని గుర్తు చేశారు. అలాంటి ప్రముఖులను వచ్చే డిసెంబర్‌లో నగరానికి ఆహ్వానిస్తామ‌ని చెప్పారు.

ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా లాంటి చిన్న దేశం 32 పతకాలను సాధిస్తే, 140 కోట్ల జనాభా కలిగిన మన దేశానికి ఒక్క బంగారు పతకం కూడా సాధించలేక పోయిందన్నారు. ఈ పరిణామం మనందరికి కనువిప్పు లాంటిది. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి.

ఒలింపిక్స్, నేషనల్ గేమ్స్ పాల్గొన దలిచే వారికి శిక్షణ పొందడానికి అన్ని వసతులతో వచ్చే సంవత్సరంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ కూడా ప్రారంభిస్తామ‌న్నారు సీఎం.