జనమే జెండా సమస్యలే ఎజెండా
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బిజీగా మారి పోయారు. ఆయన జైలు నుంచి విడుదలయ్యాక ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. మరోసారి దేశ రాజధాని ఢిల్లీపై ఆప్ జెండా ఎగుర వేయాలని కంకణం కట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేక పోయినా 17 నెలల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించారు. తీహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.
ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. ఆప్ అవినీతి, అక్రమాలకు పాల్పడదని ప్రకటించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కావాలని తనను ఇరికించాయని వాపోయారు. అయినా సత్యమే చివరకు నిలుస్తుందని, మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పీఠంపై కూర్చోవడం ఖాయమని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఆరు నూరైనా, అష్ట కష్టాలు పడ్డా విద్యా రంగంలో సంస్కరణలు తీసుకు వస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పేదలను కలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు మనీష్ సిసోడియా.
జీవితం చాలా స్వల్పమని, ఉన్నదాంట్లో బతకడం నేర్చు కోవాలని సూచించారు. ప్రచారంలో భాగంగా జంగ్ పురాలో పర్యటించారు. శ్యాం భాయ్ తో మాట్లాడారు.