సర్కార్ నిర్వాకం ఆర్ఎస్పీ ఆగ్రహం
ఖాకీల పట్ల కక్ష సాధింపు తగదు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు బీఆర్ఎస్ అగ్ర నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వం కావాలని పోలీసుల పట్ల వివక్షను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు సర్కార్ పై.
తెలంగాణ ఖజానా లో ఉన్న అవినీతి డబ్బులు ఎవరు దోచుకుంటున్నారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పటికీ దాదాపుగా లక్ష మంది పోలీసులకు ఇంత వరకు నాలుగు డీఏలు, మూడు సరెండర్ లీవులు, టీఏ లు, ఆసుపత్రుల్లో బిల్లులు ఇంకా క్లియర్ కాలేదని ఆరోపించారు .
పిల్లలకు రెండవ టర్మ్ ఫీజు కట్టనందుకు చాలా మంది పిల్లలను స్కూలు యాజమాన్యాలు క్లాసు బయటనే నిలబెడ్తున్నాయని సమాచారం తమకు వచ్చిందన్నారు. దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఒక వైపు పోలీసుల పహారాలో హైడ్రాతో పేదల గుడిసెలను కూల గొట్టి వాళ్ల పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు జీతాలియ్యకుండా ఇదే పోలీసు పిల్లల బతుకులను కూడా నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత.
రెండు వైపులా చిన్న పిల్లలే నాశనమై పోతున్నారని వాపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందని, రేవంత్ రెడ్డి మరో రాజపక్ష కాబోతున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.