గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష వెంటనే నిర్వహించాలి
సీఎంను డిమాండ్ చేసిన అనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఆలస్యం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆయన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షపై స్పందించారు.
శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం చిత్తశుద్దితో వెంటనే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు అడ్డంకిగా ఉన్న వాటిని పరిష్కరించాలని కోరారు.
ప్రధానంగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష విషయంలో కోర్టులో ఫైల్ అయిన తప్పుడు కీ, ఎస్టీ రిజర్వేషన్ , ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, జీవో 29 వర్సెస్ 55 వంటి అనేక కేసులు నడుస్తున్నాయని తెలిపారు అనుగుల రాకేశ్ రెడ్డి.
వీటిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని , గడువు ప్రకారం పరీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ కేసులు పరిష్కరించకుండా పరీక్ష గనుకనిర్వహిస్తే కోర్టు తీర్పు అనంతరం ఇతర రాష్ట్రాల మాదిరే మన దగ్గర కూడా మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సి వస్తుందని అన్నారు. దీని కారణంగా ఎంతో కష్టపడి చదువుకుంటున్న, చదివిన అభ్యర్థులు తీవ్రంగా నష్ట పోతారని ఆవేదన వ్యక్తం చేశారు అనుగుల రాకేశ్ రెడ్డి.
మానవతా దృక్ఫథంతో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలోచించాలని నిర్దేశించిన ప్రకారమే గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్ష చేపట్టాలని కోరారు.