జగన్ డిక్లరేషన్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్
వైసీపీ మతం మంటలు రేపేందుకు ప్రయత్నం
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బాస్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన తిరుపతి డిక్లరేషన్ వివాదంపై కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిక్లరేషన్ వ్యవహారం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు సంబంధించిన వ్యవహారమని , దీనిపై ఎవరూ స్పందించ వద్దని కోరారు పవన్ కళ్యాణ్ కొణిదెల. జగన్ రెడ్డి తిరుమలను సందర్శించడం ఆయన హక్కు అని, దానిని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదన్నారు.
తిరుపతి లడ్డూ కల్తీ ప్రసాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో జగన్ రెడ్డి తిరుమలను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్కంత రేపుతోంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడ వద్దని సూచించారు. అది మంచి పద్దతి కాదన్నారు. కేవలం సమస్యను మాత్రమే ఎత్తి చూపాలని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
గతంలో తుని, కోనసీమ ఘటనలతో కులాల చిచ్చు రగిలించాలని చూసిన వైసీపీ ఇప్పుడు మతం మంటలు రేపేందుకు చూస్తోందని సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల.
తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని అన్నారు.
తిరుమల ప్రసాదం అపవిత్రం కావడం, ఆలయ ఆచారాలకు భంగం వాటిల్లేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవడం అనేది హిందువుల అంతర్గత వ్యవహారమన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకొన్నవారే అందుకు విరుద్ధంగా వెళ్లినందున వారిని ప్రశ్నించాలని అన్నారు.
తిరుమలలో ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్నది వైవీ సుబ్బారెడ్డి, ఆ తరువాత కరుణాకర రెడ్డి. ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారిగా ఉన్నది ధర్మారెడ్డి. తొలుత ఈ ముగ్గురూ తిరుమల లడ్డూ అపవిత్రతకు గురైన అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.