జీఓ 46 బాధితులను అడ్డుకుంటే ఎలా..?
సీఎంపై అనుగులు రాకేశ్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ – రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన దారుణంగా ఉందని మండిపడ్డారు బీఆర్ఎస్ సీనియన్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత కొంత కాలంగా జీఓ 46 బాధితులు ఆందోళన బాట పట్టారని తెలిపారు.
శుక్రవారం తమ న్యాయ పరమైన డిమాండ్ ను పరిష్కరించాలని కోరుతూ గాంధీ భవన్ కు వెళ్లిన జీవో 46 బాధితులను రాకుండా అడ్డు కోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనుగుల రాకేశ్ రెడ్డి. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తాయే తప్పా మరోటి కాదని అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత.
రాష్ట్రంలో జరిగిన శాసన సభ, సార్వత్రిక ఎన్నికల్ల సమయంలో కేవలం ఓట్ల కోసం జీఓ 46 బాధితులను రెచ్చ గొట్టారని, ఓట్లు వేయించు కున్నారని, ఆ తర్వాత వారిని విస్మరించారని ఆరోపించారు . ఇదెక్కడి అన్యాయమని అనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు.
ఆనాడు ప్రజల సాక్షిగా జీఓ 46ను రద్దు చేస్తామని చెప్పారని, కానీ ఈనాడు అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా మరిచి పోయారంటూ మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరడం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. సిబ్బందితో గాంధీ భవన్ లో ఎలా గెంటించి వేస్తారంటూ నిప్పులు చెరిగారు అనుగుల రాకేశ్ రెడ్డి.
జీఓ 46ను వెంటనే రద్దు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నమ్మించి మోసం చేసిందన్నారు. సోయి తప్పిన ఈ ప్రభుత్వంపై పోరాడటం తప్ప మరో మార్గం లేదని అన్నారు. బాధితులకు భారత రాష్ట్ర సమితి పార్టీ తప్పక అండగా ఉంటుందని ప్రకటించారు అనుగుల రాకేశ్ రెడ్డి.