కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయం
ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి
పాలమూరు జిల్లా – సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు ఏఐసీసీ ముఖ్య కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయన పర్యటించారు. మక్తల్ తో పాటు దేవరకద్ర నియోజకవర్గాలలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా జరిగిన సభలో వంశీ చందర్ రెడ్డి ప్రసంగించారు.
బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతగా దాడులకు తెగ బడినా జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి తప్పకుండా వస్తామన్నారు.
రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. విపక్షాలు ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలు జీర్ణించు కోలేక పోతున్నారని, అవాకులు , చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు.
మొత్తం 17 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ గాలి వీస్తోందని దక్షిణాదిన తమ సత్తా ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు వంశీ చందర్ రెడ్డి.