కేంద్ర దర్యాప్తు సంస్థలంటే భయమెందుకు..?
నిప్పులు చెరిగిన ఎంపీ విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిదానిని రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
ప్రపంచ వ్యాప్తంగా బాధ్యతాయుతమైన రాజ్యాంగ పరిశోధనా సంస్థలు స్పష్టమైన ప్రక్రియను అనుసరిస్తాయని పేర్కొన్నారు. మొదట దర్యాప్తు చేయండి, రెండవదిగా నివేదించండి, చివరిగా నిందలు వేయండి అనేది ముఖ్యమని తెలిపారు.
కానీ నారా చంద్రబాబు నాయుడు కుల కేంద్రీకృత పాలనలో ఏపీ గ్రాఫ్ తగ్గి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే ఏపీలో ప్రభుత్వం రివర్స్ గేర్ లో నడుస్తోందని మండిపడ్డారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
ఓ వైపు తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడడం లేదంటూ టీటీడీ ఈవో స్పష్టం చేశారని, కానీ ఇంకో వైపు నారా చంద్రబాబు నాయుడు కల్తీ జరిగిందంటూ చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇదే సమయంలో సిట్ కు ఆదేశించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి.
తాము కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని కోరితే బాబు మాత్రం సిట్ వైపు మొగ్గు చూపడం దారుణమన్నారు.