DEVOTIONAL

శ్రీ‌నివాసుడు పుష్పాలంకార ప్రియుడు

Share it with your family & friends

శ్రీ‌వారి సేవ‌లో తరిస్తున్న పూదండలు

తిరుమల – అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ ప్రత్యక్ష దైవమైన, తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి పుష్పాలంకార ప్రియుడు.

శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనదని, పవిత్రమైన కార్యమని ”తిరువాయ్‌ మొళి” అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నారు.

స్వామి వారి ఆపాద మస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే ఈ పుష్పహారాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.⁠ ⁠శిఖామణి
కిరీటం మీదనుంచి రెండు భుజాలమీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను ‘శిఖామణి’ అంటారు. ఇది ఎనిమిది మూరల దండ.

2.⁠ ⁠సాలిగ్రామ మాల
శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూవున్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు.

3.⁠ ⁠కంఠసరి
మోడలో రెండు పోర్వలుగా రెండు భజాల మీదికి అలంకరింపబడే దండ ఒకటి మూడున్నర మూరలు.

4.⁠ ⁠వక్షస్థల లక్ష్మి
శ్రీవారి వక్షః స్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.

5.⁠ ⁠శంఖు చక్రం
శంఖు చక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర.

6.⁠ ⁠కఠారి సరం
శ్రీస్వామి వారి బొడ్డునవున్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి. రెండు మూరలు.

7.⁠ ⁠తావళములు
రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే మూడు దండలు.

  1. మూడు మూరలు 2. మూడున్నర మూరలు 3. నాలుగు మూరలు.

8.⁠ ⁠తిరువడి దండలు
శ్రీస్వామి వారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర.
ప్రతి గురువారం జరిగే ”పూలంగి సేవ”లో మాత్రమే శ్రీస్వామి వారి మూల మూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పై పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.

ఇవిగాక శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవ మూర్తులకు కూడా ఈ క్రింది విధంగా పూలమాలలు సిద్ధం చేయబడి సమకూర్చ బడతాయి.
ఉత్సవ మూర్తులకు నిత్యమూ అలంకరింబడే పూలదండల వివరాలు:

భోగ శ్రీనివాసమూర్తికి:ఒక దండ

కొలువు శ్రీనివాసమూర్తికి:ఒక దండ

శ్రీదేవి భూదేవి సహిత మలయ్పప్పస్వామికి:మూడు దండలు

శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి:మూడు దండలు

శ్రీ సీతారామలక్ష్మణులకు:మూడు దండలు

శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణులకు:రెండు దండలు

చక్రత్తాళ్వారుకు (సుదర్శనుడు):ఒక దండ

అనంత గరుడ విష్వక్సేనులకు:మూడు దండలు

సుగ్రీవ అంగద హనుమంతులకు:మూడు దండలు

ఇతర విగ్రహమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండలు:

బంగారువాకిలి ద్వారపాలకులు:రెండు దండలు

గురడాళ్వారు:ఒక దండ

వరదరాజస్వామి:ఒక దండ

వకుళమాలిక:ఒక దండ

భగవద్రామానుజులు (మూలమూర్తి, ఉత్సవమూర్తి):రెండు దండలు

యోగనరసింహస్వామి:ఒక దండ

విష్వక్సేనులవారికి:ఒక దండ

పోటు తాయారు:ఒక దండ

బేడి ఆంజనేయస్వామికి:ఒక దండ

శ్రీ వరాహస్వామి ఆలయానికి :మూడు దండలు

కోనేటిగట్టు ఆంజనేయ స్వామికి:ఒక దండ (ప్రతి ఆదివారం మాత్రమే)

ఇంకా శ్రీస్వామి వారి నిత్య కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడ ఈ పూల అరలో కూర్చబడుతాయి.

శ్రీ స్వామి వారికి అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మొల్లలు, మొగిలి, కమలం (తామర), కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపుచెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిలువం (మారేడు) ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలును వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను, పత్రాలను శ్రీవారి పుష్పకైంకర్యంలో వినియోగిస్తారు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా శ్రీస్వామి వారికి జరిగే తోమాలసేవ (పుష్ప కైంకర్యం) కు గాను ఈ పుష్పఅర నుండి సిద్ధం చేయబడిన పూల మాలలను, జియ్యం గార్లు తలపై పెట్టుకొని బాజా భజంత్రీలతో ఛత్ర చామర మర్యాదలతో వేద మంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజ స్థంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది.
(తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నుంచి జారీ చేయ బడింది)