DEVOTIONAL

అప్ప‌లాయ‌గుంట‌లో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

Share it with your family & friends

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామికి విశిష్ట పూజ‌లు

తిరుపతి – తిరుప‌తిలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు శ‌నివారం నుంచి ప్రారంభం అయ్యాయి. అంత‌కు ముందు స్వామి వారికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఈ ప‌విత్ర ఉత్స‌వాలు మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 28న ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వాలు 30వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

ఉత్స‌వాల‌లో భాగంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం, మృతా శౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి.

వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఈ పవిత్రోత్సవాలలో వేద పఠనం, ఆలయ శుద్ధి, పుణ్యాహ వచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన సెప్టెంబ‌రు 28న‌ పవిత్ర ప్రతిష్ఠ చేప‌ట్టారు. 29న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరి రోజు 30న మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన జ‌రుగ‌నుంది. ప‌విత్రోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో ర‌మేష్‌, సూపరింటెండెంట్‌ శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శివ‌కుమార్‌, ఆలయ ప్ర‌ధాన అర్చకులు సూర్య‌కుమార్ ఆచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.