కూల్చే అధికారం సీఎంకు లేదు – రాకేశ్ రెడ్డి
పెద్దలకు ఓ న్యాయం పేదలకు ఓ న్యాయమా
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రధానంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. హైడ్రా అనుసరిస్తున్న విధానం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం అనుగుల రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆక్రమణల పేరుతో పెద్దోళ్లకు వెసులుబాటు కల్పించి పేదోళ్లను లక్ష్యంగా చేసుకుని భవనాలను, ఇళ్లను కూల్చి వేయడం పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు. కూల్చే అధికారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు అనుగుల రాకేశ్ రెడ్డి. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఏదో ఒక రోజు బాధితులంతా ఒక్కటై సీఎం ఇంటిని ముట్టడించడం ఖాయమని హెచ్చరించారు.
కూల్చుకుంటూ పోతే చివరకు హైదరాబాద్ లో ఏ భవనాలంటూ ఉండవన్నారు. బఫర్ జోన్ లో ఇప్పటి వరకు నగరానికి సంబంధించి జాబితా ఏమైనా తయారు చేశారా అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఓ న్యాయం పేదలకు ఇంకో న్యాయమా అని మండిపడ్డారు రాకేశ్ రెడ్డి. కూల్చి వేతలకు సంబంధించి సీఎం ది ఓ మాట , హైడ్రాది ఇంకో మాట మాట్లాడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
విచిత్రం ఏమిటంటే ఉన్నోళ్లకు నోటీసులు ఇవ్వడం, వారంతట వారే కోర్టును ఆశ్రయించేలా ఛాన్స్ కల్పిస్తున్నారని, కానీ పేదలు, మధ్యతరగతి ప్రజల వరకు వచ్చే సరికల్లా వారికి నోటీసులు ఇవ్వకుండా,
న్యాయ స్థానాన్ని ఆశ్రయించే వీలు లేకుండా పనిగట్టుకుని శని, ఆదివారాలలో కూల్చి వేయడం ఎంత వరకు సబబు అని ఫైర్ అయ్యారు అనుగుల రాకేశ్ రెడ్డి.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సీఎం బాధ్యత వహించాలని, వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల తరపున తాము పోరాడుతామని హెచ్చరించారు.