హైడ్రా కూల్చివేత బాధితుల గుండె కోత
సమయం ఇవ్వకుండా కూల్చేశారని ఆవేదన
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కూల్చివేతల విధానం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కొందరికి నోటీసులు ఇవ్వడం, మరికొందరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనాలను కూల్చి వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరానికి చెందిన హైడ్రా బాధితులంతా శనివారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా వారంతా మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, తదితర నేతలతో మొర పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలని, లేక పోతే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటి పర్యంతం అయ్యారు.
మూసీని సుందరీకరణ చేస్తామంటూ తమ బతుకులను ఆగం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు బాధితులు. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలి పోతే తట్టుకునే శక్తి తమకు లేదన్నారు. కంటి మీద కునుకు ఉండడం లేదని, ఏ సమయంలో ఎప్పుడు వస్తారో తెలియక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమను ఆదుకోవాలని విన్నవించారు హైడ్రా బాధితులు.
ఈ సందర్బంగా బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సబితా రెడ్డిలు. ఈ సందర్బంగా బాధితులకు న్యాయ పరంగా సేవలు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. 24 గంటల పాటు తమ బృందం తెలంగాణలో అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.