మాజీ స్పీకర్ పై విచారణ జరిపించాలి
ఎమ్మెల్యే కూన రవి కుమార్ డిమాండ్
అమరావతి – ఆముదాలవలస శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవి కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై నిప్పులు చెరిగారు. ఆయన ఫేక్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నాడని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు ఎమ్మెల్యే కూన రవి కుమార్. నకిలీ డిగ్రీతో ఎల్బీ నగర్ లోని మహాత్మా గాంధీ లా కాలేజీలో అడ్మిషన్ పొందారని ఆరోపించారు.
నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నాడని గతంలో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర చీఫ్ జస్టిస్ కు , సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి , రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు ఎమ్మెల్యే. అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అయితే రాష్ట్రపతి కార్యాలయం నుండి సీఎస్ కు విచారణ చేయమని లేఖ రాశారని, కానీ అప్పటి సీఎస్ చర్యలు తీసుకోవాలని వాపోయారు కూన రవి కుమార్.
ఓపెన్ యూనివర్శిటీ నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ ను తమ్మినేని సీతారాం పొందాడని దీనితోనే లా అడ్మిషన్ తీసుకున్నాడని, ఆ తర్వాత స్పీకర్ అయ్యారని ఆరోపించారు.