ప్రజల కోసం సీఎంను కలుస్తాం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రకటన
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన శాసన సభ్యులు సునీతా లక్ష్మా రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరంతా జంప్ కాబోతున్నారని, ఇంకొందరు ఎమ్మెల్యేలు వీడనున్నారని, కాంగ్రెస్ లో చేరనున్నారని జోరందుకుంది.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. తాము మర్యాద పూర్వకంగా సీఎంను కలిశామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి బ్రదర్స్ చాలా కలిశారని అలా అని వారు తమ పార్టీలో చేరుతారని తాము ప్రచారం చేయలేదన్నారు.
రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. తనపై హత్యాయత్నం జరిగిందని, అయితే గన్ మెన్లను కుదించడంపై ఆరా తీశామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అన్ని నియోజకవర్గాలలో జరగాల్సిన అభివృద్ది కార్యక్రమాల గురించి సీఎంతో చర్చించడం జరిగిందని , దీనికి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.