మోదీ కామెంట్స్ బక్వాస్ – ఖర్గే
నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్
జమ్మూ కాశ్మీర్ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్, పీఎం మోడీ అబద్దాలు చెప్పడంలో ఆరి తేరారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖర్గే ప్రసంగించారు. మోదీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో హామీ ఇస్తున్నారని, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. దీంతో యువత తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు ఖర్గే.
మాయ మాటలు చెప్పడంలో , మోసం చేయడంలో మోడీని మించిన నాయకుడు దేశంలో లేరన్నారు ఏఐసీసీ చీఫ్. గత పదేళ్లలో దేశం మొత్తం యువత అంధకారంలోకి నెట్టబడిందని ఆరోపించారు, దీనికి మోదీజీయే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
నిరుద్యోగుల గణాంకాలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చాయని, 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం మోదీజీ ఫలితమేనని ఆరోపించారు. మోడీ, షాలు ఉపాధి కల్పించడం గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రసంగాలు చేయడం, ఫోటోలు తీయడం, రిబ్బన్లు కత్తిరించడం మాత్రమే చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని ప్రభుత్వ విభాగాల్లో 65 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇక్కడ ఉద్యోగాలు కాంట్రాక్టు, రోజు వారీ వేతనాల ఆధారంగా బయటి వ్యక్తులకు ఇస్తున్నారని తెలిపారు. జమ్మూలోని ఎయిమ్స్‌లో కూడా జమ్మూకు చెందిన వారికి ఉద్యోగాలు రాలేదని తనకు సమాచారం అందిందని చెప్పారు ఖర్గే.