కొలువు తీరిన ఉదయనిధి స్టాలిన్
డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం
తమిళనాడు – తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు ఉదయనిధి స్టాలిన్. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు కీలక మంత్రులు, నేతలు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వారసత్వ రాజకీయాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఉన్నట్టుండి సంచలన ప్రకటన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్.
గతంలోనే తన వారసుడు ఉదయనిధి స్టాలిన్ అంటూ ప్రకటించారు. ప్రస్తుతం స్టాలిన్ సీఎంగా ఉన్నప్పటికీ అంతా తానై నడిపిస్తున్నాడు తనయుడు ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్.
తన కుమారుడిని ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి. తన పార్టీ వర్గాలనే కాదు ప్రతిపక్షాలను కూడా విస్తు పోయేలా చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే కోట్లాది మంది అభిమానులను కలిగిన దళపతి విజయ్ పార్టీని పెట్టారు. దీంతో రాబోయే శాసన సభ ఎన్నికలు అత్యంత క్లిష్టంగా మారనున్నాయి.
ఈ తరుణంలో తన ఆరోగ్యం దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు ఎంకే స్టాలిన్. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.