పాలనా వైఫల్యం లడ్డూ కల్తీ వివాదం
నిప్పులు చెరిగిన గుడివాడ అమర్ నాథ్.
విశాఖపట్నం – ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా పరంగా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశాడని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని ఏకి పారేశారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తిరుపతి లడ్డు కల్తీ వివాదాన్ని కావాలని చంద్రబాబు నాయుడు తెర పైకి తీసుకు వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి.
చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన అట్టర్ ప్లాప్ అయ్యిందని మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టేందుకే కొత్త వివాదాన్ని ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడని ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగానే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తమను డ్యామేజ్ చేసేలా కుట్ర పన్నారని ధ్వజమెత్తారు గుడివాడ అమర్నాథ్. అది బెడిసి కొట్టడంతో చివరకు గత్యంతరం లేక తమ పార్టీ చీఫ్ , మాజీ సీఎం జగన్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం మొదలు పెట్టాడని అన్నారు.
తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, తమ పార్టీ చీఫ్ ఇప్పటికే పీఎం మోడీకి, సీజేఐకి లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని కోరామని, కానీ భయపడిన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, చివరకు ఒత్తిడి పెరగడంతో సిట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు గుడివాడ అమర్నాథ్.