వైజాగ్ స్టీల్ ప్లాంట్ చైర్మన్ గా సక్సేనా
సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
విశాఖపట్నం – కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ వైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానిని ప్రైవేటీకరణ చేయొద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ చైర్మన్ గా అజిత్ కుమార్ సక్సేనాను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా అజిత్ కుమార్ సక్సేనా గతంలో ఆపరేషన్స్ డైరెక్టర్ గా పని చేశారు. అంతకు ముందు ఆయన మాంగనీస్ లిమిటెడ్ సంస్థకు సీఎండీగా బదిలీపై వెళ్లారు. తిరిగి విశాఖ స్టీల్ ప్లాంట్ కు చైర్మన్ గా వచ్చారు సక్సేనా.
కాగా పూర్తి స్థాయిలో ఉక్కు సంస్థకు చైర్మన్ ను నియమించేంత వరకు అజిత్ కుమార్ సక్సేనా తాత్కాలిక చైర్మన్ గా కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.