రైతన్నలారా తరలి రండి – ఈటల
బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఆరోపించారు. కావాలని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు.
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమై పోయాయని ప్రశ్నించారు ఈటల రాజేందర్. మాయ మాటలు చెప్పి, మోస పూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయక పోతే ఎలా అని నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి తనంతకు తానుగా రాజుగా భావిస్తున్నాడని, అందుకే రాచరిక పాలనకు తెర తీశాడని, ఇది చెల్లుబాటు కాదన్నారు. చరిత్రలో ప్రజలే చరిత్ర నిర్మాతలని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రధానంగా ఇవాళ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు ఈటల రాజేందర్.
రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ 24 గంటల దీక్షకు పిలుపునిచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ.