దేశంలో అత్యధిక పెన్షన్లు ఏపీలోనే
మంత్రి డోలా వీరాంజనేయ స్వామి
అమరావతి – దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి. మంగళవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెన్షన్ దారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఫించన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్ళల్లో రెట్టింపు ఆనందం చూస్తున్నామని చెప్పారు.
దేశంలోనే అధిక ఫించను ఇచ్చేది మన రాష్ట్రంలోనేనని అన్నారు. పింఛను రూ 1000 పెంచడానికి జగన్ కు ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాల్లోనే ఫించను రూ 4 వేలకు పెంచారని స్పష్టం చేశారు .
జగన్ లా తాము ప్రజలను మోసం చేయడం లేదని, అన్ని హామీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.
టీటీడీ నెయ్యి కల్తీ ఘటన పై సిట్ ఏర్పాటు చేశామని, దీని వెనుక ఎవరున్నా వదిలి పెట్ట బోమంటూ హెచ్చరించారు.