బాబూ దేవుడు నిన్ను విడిచి పెట్టడు
వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఫైర్
అమరావతి – వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా ఎలా పడితే అలా నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఇదే విషయాన్ని సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా తప్పు పట్టిందన్నారు. అయినా నీకు బుద్ది రావడం లేదంటూ ఎద్దేవా చేశారు.
ఏది ఏమైనా ఏది చేయకూడదో అదే చేశావని, సాక్షాత్తు కలియుగ దైవమైన తిరుమల క్షేత్రంపై అభాండాలు మోపావని, ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడని హెచ్చరించారు. నువ్వు క్షమించరాని తప్పు చేశామని పేర్కొన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
విశ్వసనీయంగా నమ్మలేని వెన్నుపోటు దారుడు, స్థిరంగా అస్థిరమైన రాజకీయ నాయకుడు, నమ్మకమైన ద్రోహిగా తన ఖ్యాతిని సంపాదించుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. తిరుమల సమస్యపై ఎలాంటి కచ్చితమైన రుజువు లేకుండా దుష్ప్రచారం చేస్తూ ఆయన స్వయం ప్రకటిత ’40 ఏళ్ల పరిశ్రమ’ మళ్లీ పని చేస్తోందని పేర్కొన్నారు ఎంపీ.
ఇటువంటి చర్యలు భారతీయ శిక్షాస్మృతి (IPC), సైబర్ చట్టాలతో సహా వివిధ చట్టాల ప్రకారం శిక్షకు దారి తీయవచ్చని అంచనా వేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బాబును డిమాండ్ చేశారు.