తిరుమల సన్నిధిలో పవన్ కళ్యాణ్
ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం
తిరుమల – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల కాలినడకన తిరుపతి అలిపిరి మెట్ల మార్గం ద్వారా ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కోట్లాది మంది భక్తులు కొలిచే కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామి , అలివేలు మంగమ్మలు కొలువు తీరిన తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. భారీ ఎత్తున ఆయన వెంట భక్తులు, అభిమానులు నడిచి కొండ పైకి వచ్చారు.
తిరుపతి లడ్డూ కల్తీ ప్రసాదం వివాదం దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ధర్మం కోసం, దేశం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఇది కోట్లాది హిందువుల మనో భావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా బుధవారం తన ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. స్వామి వారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ దీక్ష విరమించినా ధర్మం కోసం , హిందూ పరిరక్షణ కోసం తన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు డిప్యూటీ సీఎం.